దుబాయ్ నుంచి వేధింపులు.. పాత ఫొటోలతో వివాహితకు బ్లాక్‌మెయిల్!

  • విజయవాడ యువతికి దుబాయ్ నుంచి వేధింపులు
  • సన్నిహిత ఫొటోలు బయటపెడతానని బ్లాక్‌మెయిల్
  • డబ్బు, బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణ
  • వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పరువు తీస్తానని బెదిరింపులు
  • బాధితురాలి ఫిర్యాదుతో విజయవాడ సైబర్ క్రైం పోలీసుల కేసు
విజయవాడకు చెందిన ఓ వివాహితను దుబాయ్‌లో ఉంటున్న ఓ వ్యక్తి బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. గతంలో పరిచయం ఉన్న వ్యక్తి... సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు బయటపెడతానంటూ డబ్బు, బంగారం డిమాండ్ చేస్తూ వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

విజయవాడ నగర శివారు ప్రాంతానికి చెందిన యువతికి షేక్ సుభానీ అనే వ్యక్తితో గతంలో పరిచయం ఉంది. అయితే, ఆమెకు మరొకరితో వివాహం అయినప్పటి నుంచి సుభానీ వేధించడం మొదలుపెట్టాడు. "నాతో మాట్లాడు, వీడియో కాల్స్ చెయ్యి. లేకపోతే మన ఫొటోలు బంధువులు, స్నేహితులకు పంపిస్తా" అంటూ బెదిరించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

బాధితురాలు అతనితో మాట్లాడటం మానేయడంతో, ఆమె నగ్న చిత్రాలను భర్తకు పంపించాడు. ఇది గమనించిన భర్త ఆ నంబర్‌ను బ్లాక్ చేశారు. అయినప్పటికీ, సుభానీ వేర్వేరు నంబర్ల నుంచి ఫోన్లు చేస్తూ వేధింపులు కొనసాగించాడు. అంతటితో ఆగకుండా, బాధితురాలి ఫోన్‌లోని కాంటాక్ట్‌లతో ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, అందులో ఈ ఫొటోలు, వీడియోలు పెడతానని బెదిరించాడు. డబ్బు, బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కొన్ని అంతర్జాతీయ నంబర్లు ఉండటంతో సుభానీ దుబాయ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అతని కుటుంబ సభ్యులు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. ఈ ఫిర్యాదు ఆధారంగా విజయవాడ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 
Go Back to Shorts

More Telugu News